Sunday 26 July 2009

ఇంకొక ద్రిమ్మరి

ఒకసారి నాకు రోడ్డుమీద ఇంకో మనిషి కనబడ్డాడు-

అతనుకూడా కొంచెం తిక్క మనిషిలాగానే ఉన్నాడు. అతను నాతో అన్నాడు:

"నేనొక ద్రిమ్మరిని. చాలాసార్లు నాకు అనిపిస్తుంటుంది- 'నేను ఈ భూమిమీద పొట్టి పొట్టి మనుషులమధ్య తిరుగాడుతున్నాన'ని. మరి, అలా నాతల మిగిలినవాళ్ళ తలలకంటే భూమినుండి డెబ్భై క్యూబిట్లు దూరంగా ఉన్నది గనక, అది ఇంకొంచెం ఉన్నతమైన, స్వతంత్రమైన ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తూంటుందేమో!"

"కానీ నిజానికి నేను మనుషుల మధ్య నడవను- వాళ్ల మీదుగా నడుస్తుంటాను. వాళ్ల పొలాల్లో నా అడుగుల గుర్తుల్ని తప్ప, వాళ్లు నన్ను వేరేగా ఏమీ అసలు చూడనే చూడలేరు."

"నా అడుగుజాడల ఆకారాన్ని గురించీ, వాటి పరిమాణాన్ని గురించీ వాళ్లలోవాళ్ళు చర్చించుకోవటమూ, విభేదించుకోవటమూ చాలాసార్లు గమనించాను నేను-"

"కొందరంటారు- 'ఇవి ఎన్నడో, సహస్రాబ్దాల కిందట భూమిమీద తిరుగాడిన రాక్షసజీవుల అడుగుజాడలు' అని."

"ఇంకొందరంటారు- 'కాదు! కాదు! సుదూరంగా ఉన్న నక్షత్రాలనుండి రాలిన ఉల్కాపాతాలు ఏర్పరచిన లోయలు ఇవి' అని."

"కానీ నువ్వు- నువ్వు తెలుసుకున్నావు మిత్రమా ఇప్పుడు- ఇవి అవేమీ కావు- ఇవన్నీ ఒక ద్రిమ్మరి అడుగుజాడలు- అంతే." అని.

ఇద్దరు వేటగాళ్లు

వసంత ఋతువులో ఒకనాడు సంతోషమూ, దు:ఖమూ ఒక చెరువు ఒడ్డున కూర్చుని ఉన్నాయి. నిశ్శబ్ద ప్రశాంతతలీనే నీళ్లకు దగ్గరగా చేరగిలపడి, అవి మాట్లాడుకుంటున్నాయి.

ఈ భూమి మీద ఉన్న అందం గురించీ; అడవిలోనూ, కొండల్లోనూ ఉన్న అద్భుత జీవ సంపద గురించీ; ఉదయ సంధ్యలోను, సాయం సమయంలోనూ వినిపించే పాటల గురించీ మాట్లాడింది సంతోషం.
అప్పుడు దు:ఖం మాట్లాడుతూ సంతోషం చెప్పిన వాటిని అన్నింటినీ అంగీకరించింది- ఎందుకంటే కాలపు మహిమా, అందులోని అందమూ దు:ఖానికీ తెలుసు. ఇక పొలాల్లోనూ కొండల్లోనూ ఉన్న వసంతాన్ని గురించి చాలా గొప్పగా వర్ణించింది దు:ఖం.

అలా సంతోషమూ, దు:ఖమూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాయి. అవి మాట్లాడుకున్న ప్రతి అంశంపైనా రెండూ సంపూర్ణంగా ఏకీభవించాయి.

అదే సమయానికి చెరువుకు అవతలి ఒడ్డున ఇద్దరు వేటగాళ్లు పోతూ వాటిని గమనించారు. వాళ్లు అటుకేసి చూస్తుండగా ఒక వేటగాడన్నాడు- "ఎవరయి ఉంటారు, వీళ్లిద్దరూ?" అని.

"ఇద్దరంటున్నావా!? నాకైతే ఒక్కరే కనబడుతున్నారు" అన్నాడు రెండవ వాడు.

"కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు" అన్నాడు మొదటివాడు.

"నాకైతే ఒక్కరే కనబడుతున్నారక్కడ. చెరువులో కనబడుతున్న ప్రతిబింబం కూడా ఒక్కటే ఉన్నది" అన్నాడు రెండవ వాడు.

"కాదు, ఇద్దరున్నారు అక్కడ!" అన్నాడు మొదటి వాడు. "నిశ్చలంగా ఉన్న ఆ నీళ్లలో ప్రతిబింబం కూడా ఇద్దరు వ్యక్తులది".

రెండవ వాడు గట్టిగా చెప్పాడు "నేను ఒక్కరినే చూడగల్గుతున్నాను!" అని.

మొదటి వాడూ గట్టిగా చెప్పాడు "కానీ నాకైతే ఇద్దరు స్పష్టంగా కనబడుతున్నారు!" అని.

అప్పటి నుండి ఈనాటి వరకూ కూడా 'తన మిత్రుడికి ఒక వస్తువు రెండుగా కనబడుతుంద'ని వెక్కిరిస్తుంటాడు ఒక వేటగాడు.

"నా మిత్రుడికి కొంచెం చూపు సరిగా‌ ఆనదు" అంటుంటాడు రెండోవాడు.

నది

గొప్ప నది ఒకటి ప్రవహించే కదిశ లోయలో, రెండు వాగులు ఒకచోట కలిసి మాట్లాడుకుంటున్నాయి. మొదటిది అడిగింది- "ఎలా వచ్చావు, మిత్రమా? నీ మార్గం ఎలా ఉండింది?" అని.

"నా మార్గంలో చాలా‌ అడ్డంకులు ఎదురయ్యాయి. మిల్లుకు ఉండే చక్రం విరిగిపోయింది. నన్ను కాలువలోంచి బయటకు మళ్లించి, మొక్కలకు అందించే రైతు చచ్చిపోయాడు. ఊరికే కూర్చుని, వాళ్ల బధ్ధకాన్ని సూర్యుడి ఎండ క్రింద మాడ్చుకోవటం మినహా మరేదీ చెయ్యని జనాల మడ్డినంతా మోసుకుంటూ, ఎంతో అవస్థపడి, కిందికి జారి రావలసి వచ్చింది. కానీ నీ మార్గం ఎలా ఉండింది, సోదరా?" అన్నది రెండవ వాగు.

"నా మార్గం చాలా భిన్నంగా ఉండింది. నేను కొండ నుండి జాలువారి, సువాసనలీనే పూలబాటల్లోంచి, సిగ్గుపడే పొదల్లోంచి ప్రయాణించాను. స్త్రీలు, పురుషులు అందరూ నన్ను వెండి గిన్నెలతో తాగారు. నా అంచుల్లో కూర్చుని చిన్న చిన్న పిల్లలు వాళ్ల గులాబీ పాదాలతో తెడ్లు వేశారు. నా చుట్టూతా అంతా సంతోషమూ, నవ్వులూ, తియ్యని పాటా ఉండినై. కానీ పాపం, నువ్వు వచ్చిన మార్గం అంత సంతోషంగా లేనందుకు నాకు చాలా జాలిగా ఉంది" అన్నది మొదటివాగు.

అంతలో నది అన్నది పెద్ద గొంతుతో- "రండి, రండి, వచ్చేయండి లోపలికి! మనం సముద్రంలోకి పోబోతున్నాం. వచ్చేయండి! ఇక మాట్లాడకండి! ఇప్పుడు నాతో కలిసి ఉండండి. మనం సముద్రంలోకి చేరుకోబోతున్నాం. వచ్చేసెయ్యండి! నాలో కలిసినాక మీరు మీ యాత్రలన్నిటినీ మర్చిపోతారు- అవి సంతోషాల్నిచ్చినా, బాధల్నిచ్చినా- అన్నీ మర్చిపోతారు. రండి! రండి! మన సముద్రమాత ఒడిలోకి చేరుకున్న తరువాత మీరూ, నేనూ- అందరమూ మన మన మార్గాల్ని మర్చిపోతాం!" అని.

దైవదర్శనం

ఇద్దరు వ్యక్తులు ఒక పర్వతమార్గంలో పోతున్నారు.

వారిలో ఒకడు ఒక కొండకేసి చూపుతూ "అక్కడ, ఎత్తుగా, కొండవాలున, ఆ కుటీరం కనిపిస్తున్నది చూశావా? ప్రపంచాన్ని చాలాకాలం క్రితమే త్యజించిన ఋషి ఒకాయన అక్కడ నివసిస్తున్నాడు. ఈ ప్రాపంచిక విషయాల్ని వేటినీ ఆయన ఆశించడు- కేవలం భగవంతుడినే అపేక్షిస్తుంటాడు" అన్నాడు.

"ఆయన తన ఈ పర్ణశాలను, ఈ ఆశ్రమపు ఒంటరి జీవితాన్నీ వదిలి పెట్టేంతవరకూ, -మనతోబాటు కలిసిపోయి, మన సంతోషాల్నీ, దు:ఖాల్నీ పంచుకుంటూ. మన ప్రపంచంలోకి వచ్చి చేరుకునేంత వరకూ- వివాహపు వేడుకల్లో మన వాళ్లతో కలిసి నాట్యం చేస్తూ, మనవాళ్ల మృత కళేబరాల చుట్టూ చేరి, మనం ఏడ్చినట్లుగా ఏడుస్తూ ఉండలేనంత వరకూ ఆయనకు భగవంతుడు కనపడడు" అన్నాడు రెండవవ్యక్తి.

రెండవవ్యక్తి తన మనసులోనైతే ఆ మాటతో పూర్తిగా ఏకీభవించాడు. అయినా అన్నాడు"నేను నువ్వు చెప్పినదానినేమీ కాదనను- కానీ 'ఆ ఋషి మంచి మనిషి ' అని మాత్రం నమ్ముతాను నేను. అయినా, ఓ మాట చెప్పు- నిజంగా లేకున్నా పైకి మాత్రం కనబడే ఇందరు మనుషుల మంచితనం కంటే, ఇక్కడ లేని నిజమైన మంచి తనమే మంచిది- కాదంటావా?" అని.

శాంతి అంటుకుంటుంది

వసంతంలో, విరిసిన కొమ్మ ఒకటి తన ప్రక్క కొమ్మతో- "ఈ రోజు అంతా బోసి పోయినట్లు, చాలా వెలితిగా ఉన్నది" అన్నది. రెండో కొమ్మ మొదటి దానితో ఏకీభవించింది-"అవును. ఈ రోజు అస్సలు బాగా లేదు. నిజంగానే అంతా ఖాళీగా, వెలితిగా ఉంది" అన్నది.

అప్పుడే, పిచ్చుక ఒకటి ఎగిరి వచ్చి, ఒక కొమ్మమీద వాలింది. అంతలోనే ఇంకో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి, ఆ ప్రక్క కొమ్మన కూర్చున్నది. వాటిలో ఒకటి కిచకిచలాడుతూ అన్నది- నా తోటి పిచ్చుక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది" అని.

దానికి రెండో పిచ్చుక జవాబిచ్చింది- "నా జంటది కూడా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయింది. అది ఇక తిరిగిరాదు. అయితేనేమి, నాకు?" అని.

అప్పుడిక అవి రెండూ కిచకిచలాడుతూ, ఎగురుకుంటూ, తిట్టుకోవడం, కొట్టుకోవటం మొదలెట్టాయి.

అకస్మాత్తుగా ఆకాశం నుండి ఇంకో రెండు పిచ్చుకలు ఊడిపడ్డాయి. అవి నిశ్శబ్దంగా వచ్చి, కొట్టుకుంటున్న పిచ్చుకల పక్కనే కదలకుండా కూర్చున్నాయి. ఇక ప్రశాంతత వచ్చింది అక్కడికి. శాంతి ఏర్పడింది.

ఆపైన ఆ నాలుగూ రెండు జంటలుగా ఎగిరిపోయాయి.

అప్పుడు మొదటి కొమ్మ రెండో కొమ్మతో అన్నది - "అబ్బ! ఎంత గందరగోళపు శబ్దం!" అని. రెండో కొమ్మ జవాబిచ్చింది - "నువ్వు దానికి ఏ పేరు పెట్టినా సరే, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగాను, విశాలంగానూ ఉన్నది. మరి , పైగాలి శాంతిస్తే, నాకనిపిస్తున్నది, క్రింద బ్రతికే వాళ్లుకూడా కొంత శాంతిని తెచ్చుకుంటారని. గాలిని కొంచెం గట్టిగా, నా దగ్గరికీ విసిరి పంపరాదూ?" అన్నది.

"ఓహ్, తప్పకుండా. శాంతి కోసం, తప్పకుండా వీస్తాను. వసంతం అయిపోతే ఎలా మరి?" అంటూ మొదటికొమ్మ గాలిని బలంగా వీచుకుంటూ రెండో కొమ్మను కౌగిలించుకున్నది.

Saturday 25 July 2009

డెబ్భై

యువకుడైన కవి ఒకడు ఒక మహారాణితో అన్నాడు- "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని.

రాణి అన్నది- "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కుమారా!" అని.

"కానీ నేను మీ కొడుకుగా కాదు- ఒక మగవాడిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను!" అన్నాడు కవి.

"నేను మగపిల్లలనూ, ఆడపిల్లలనూ కన్న తల్లిని. వాళ్లు కూడా ఇప్పుడు కొడుకులకూ, బిడ్డలకూ తల్లులూ, తండ్రులూ అయ్యారు. నా కొడుకు కొడుకు ఒకడు, నీ కంటే పెద్దవాడు!" అన్నది రాణి.

యువకవి అన్నాడు- "అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను" అని.

ఆ తర్వాత కొద్దికాలానికే రాణి చనిపోయింది. అయితే ఆమె విడిచిన తుది శ్వాస ఈ పుడమి యొక్క గురుతర శ్వాసను తిరిగి చేరేలోపుగా ఆమె తన ఆత్మలో ఆక్రోశించింది- "ప్రియుడా, నా నిజమైన కుమారా, నా యువకవీ, మనం ఏదో ఒకనాడు మళ్లీ కలుసుకుందాం- అప్పుడు మాత్రం నేను డెబ్భైఏళ్ల దాన్ని అవ్వను!" అని.

నీడ

ఆషాఢ మాసంలో ఒకనాడు, గడ్డిపోచ ఒకటి, ఒక తాటిచెట్టు నీడతో అన్నది చికాకుగా- "నువ్వసలు నిశ్చలంగా ఉండవేమి? ఎప్పుడూ అటూ-ఇటూ కదులుతూ నా ప్రశాంతతను పూర్తిగా భగ్నం చేస్తున్నావు!" అని.

"అయ్యో! నేను కాదు, నేను కాదు. ఒకసారి తలెత్తి చూడు, ఆకాశంవైపు! అక్కడో చెట్టుంది- గాలికి తూర్పుకూ, పడమరకూ ఊగుకుంటూ- చూశావా, భూమికీ, సూర్యుడికి మధ్యగా ఊగుతున్నది?" అన్నది నీడ.

అప్పుడు గడ్డిపోచ తలెత్తి, మొట్టమొదటి సారిగా బ్రహ్మాండమైన తాటిచెట్టును చూసింది. "ఆహా! చూడు! నా కంటే పెద్ద గడ్డి ఇంకోటి ఉన్నది!" అని అది తనలో తనే అనుకొని అబ్బురపడింది.

ఆ పైన అది చప్పుడు చేయలేదు.

తిమింగలము - సీతాకోక చిలుక

ఒకనాటి సాయంత్రం పూట, రైల్లో ఒకాయన, ఒకామె అనుకోకుండా కలిశారు. వాళ్లిద్దరికీ ముందే పరిచయం ఉన్నది.

అతను ఒక కవి. ఆమె ప్రక్కనే కూర్చుని, అతను ఆమెకు కథలు- కొన్ని అల్లినవీ, కొన్ని ఇతరులవీ కూడానూ- చెప్పి ఉల్లాసపరుద్దామనుకున్నాడు.

కానీ అతను ఇంకా మొదలు పెట్టీ పెట్టకనే ఆమె నిద్రలోకి జారుకున్నది. అకస్మాత్తుగా బండి కుదపటంతో, ఆమె లేచి కూర్చున్నది. వెంటనే కవితో అన్నదామె- "జోనా మరియు తిమింగలం కథను మీరు వివరించిన తీరు నాకు చాలా నచ్చిందండీ!" అని.

"కానీ తల్లీ! నేను నీకు ఇందాకటి నుంచి చెబుతున్నది అదికాదు. నేను స్వయంగా రచించిన "సీతాకోక చిలుక - తెల్ల గులాబీ"ల కథను, అవి రెండూ ఒక దానితోఒకటి ప్రవర్తించిన తీరును చెబుతున్నాను!" అన్నాడు కవి.

మార్గం

కొండల మధ్య ప్రాంతంలో ఒక మహిళ తన కొడుకుతోబాటు నివసించేది. ఆమెకు అతను ఒక్కగానొక్క బిడ్డ.

అతనికి ఒకసారి చాలా జ్వరం వచ్చింది. డాక్టరు వచ్చి చేయగలిగినదంతా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అతను చనిపోయాడు.

ఆ తల్లి తన గర్భశోకాన్ని తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చింది. "చెప్పండి, చెప్పండి, నా కొడుకు శక్తిని నిస్తేజం చేసిందీ, అతని పాటను మూగబోయేలా చేసిందీ ఎవరు?" అని ఆమె వైద్యుడిని నిలదీసింది.

వైద్యుడన్నాడు "జ్వరం" అని.

"జ్వరం అంటే ఏమిటి?" అన్నదా తల్లి.

"నేను దాన్ని సరిగా వివరించలేను. మన శరీరాన్ని సందర్శించే వాటిలో అతి సూక్ష్మమైనది అది. మన ఈ నేత్రాలతో మనం దాన్ని చూడటం సాధ్యం కాదు" అన్నాడు వైద్యుడు.

అలా అని వైద్యుడు వెళ్లిపోయాడు. "అతిసూక్ష్మమైనదట. మనం ఈ కళ్లతో దాన్ని చూడలేమట" అని మళ్లీ మళ్లీ తనకు తానే చెప్పుకుంటూ కూర్చున్నదామె, అక్కడే.

ఆ రోజు సాయంత్రం ఆమెను ఓదార్చేందుకు చర్చి ఫాదర్ వచ్చాడు. ఆమె ఏడుస్తూ బిగ్గరగా "అయ్యో! నేను నా ఒక్కగానొక్క కొడుకును- నా వాడిని- ఎందుకు, కోల్పోయాను?" అని మొత్తుకున్నది.

"బిడ్డా, అదే దేవుని కోరిక " అన్నాడు ఫాదర్.

"దేవుడంటే ఏమిటి? దేవుడంటే ఎవరు? నాకు తెలిస్తే నేను వెళ్లి నా గుండెలు చీల్చి ఆయన ముందు పెడతాను. నా రక్తంతో ఆయన పాదాలు కడుగుతాను. ఆయన ఎక్కడ దొరుకుతాడో చెప్పండి నాకు, చాలు" అన్నది ఆమె.

"భగవంతుడు అనంత వ్యాపి. ఆయన్ని మన ఈ కళ్లతో చూడటం సాధ్యం కాదు." అన్నాడు ఫాదర్.

"అనంత వ్యాప్తి కోరిక మేరకు అతి సూక్ష్మమైనది వచ్చి నా కొడుకును పొట్టన పెట్టుకున్నది. అంటే ఇక మనం ఏమిటి? ఏంటట, మనం?" అని రోదించింది ఆ తల్లి.

సరిగ్గా అదే సమయానికి ఆమె తల్లి వచ్చింది- గది లోపలికి - శవంమీద బట్ట తీసుకొని. ఫాదర్ పలుకులనూ, తన కూతురి ఆవేదననూ రెంటినీ విన్నదామె. ఆపైన తన చేతుల్లోని బట్టను శవంమీద కప్పి, కూతురి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆమె అన్నది- "తల్లీ, ఆ అతి సూక్ష్మమూ, అనంత వ్యాప్తమూ, రెండూ మనమే. ఆ రెండింటికీ మధ్య ఉన్న మార్గం కూడా మనమే!" అని.

రాజదండం

"రాణీ, నువ్వు నిజానికి రాణిగా ఉండదగవు. నా భార్యగా ఉండేందుకు కావలసిన సౌకుమార్యంగానీ, అందచందాలు గానీ నీలో లేవు. నీలో ఉన్నదంతా వికారమే" అన్నాడొక రాజు భార్యతో.

రాణి జవాబిచ్చింది పదునుగా- "రాజా! నిన్ను నువ్వు ఒక రాజుననుకుంటున్నావు. కానీ నిజానికి మానసికంగా నీఅంత పేదవాడు ఇంకెక్కడా ఉండడు" అని.

ఈ మాటలకు రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే అతను రాజదండాన్ని చేతిలోకి తీసుకొని, దానితో రాణి తలపై మోదాడు బలంగా.

ఆ క్షణంలోనే అంత:పుర ప్రధానాధికారి ప్రవేశించి అన్నాడు రాజుతో "భళి భళి మహారాజా! ఆ దండాన్ని ఈ రాజ్యంలో కెల్లా అతి గొప్ప కళాకారుడు సృజించాడు. నేనేం చెప్పేది, ఏదో ఒకవాటికి చరిత్ర మిమ్మల్ని, మహారాణిని కూడా మరిచిపోతుంది. కానీ తరతరాలకు చెదరని సౌందర్యఖనిగా ఈ రాజదండం మాత్రం నిలచి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని మహారాణీవారి రక్తంతో తడిపారు- కాబట్టి అందరూ దాన్ని మరింత గౌరవిస్తారు, మరింతగా గుర్తుచేసుకుటారు"అని.
Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License