Friday 24 July 2009

ఇద్దరు దైవభటులు

ఒకరోజు సాయంత్రం దేవలోకపు భటులు ఇద్దరు నగర ద్వారం దగ్గర కలిసి ఒకరినొకరు పలకరించుకున్నారు.

దేవదూత అడిగాడు-" నువ్వేం చేస్తున్నావు, ఈ మధ్య? నీకు ఏ పని ఇచ్చారు?" అని.

రెండవ దేవదూత బదులిచ్చాడు- "ఇక్కడ, ఈ లోయలో చివరన, ఒక పాపి ఉన్నాడు- చాలా ఘోరపు పాపి అనాలి. నన్ను ఆ పాపికి సంరక్షకుడిగా నియమించారు. సులభమనుకునేవు సుమా, అది చాలా కష్టమైన పని, చాలా ముఖ్యమైన పని కూడాను. నేను చాలా శ్రమపడాల్సి వస్తున్నది" అన్నాడు.

మొదటి దూత అన్నాడు- " దానిదేముంది? అది చాలా సులభమైన పని. నాకు పాపులు చాలా మంది తెలుసు. అనేక పర్యాయాలు నేను పాపుల్ని సంరక్షించాను కూడా. కానీ ప్రస్తుతం నేను అల్లంత దూరాన అడవిలో నివసించే మహాత్ముడి సంరక్షకుడిగా నియమింపబడి ఉన్నాను. నేను చెప్పలేను, కానీ ఈ పని మాత్రం అత్యంత కఠినమైనది. చాలా సున్నితమైనదిన్నీ." అని.

మొదటివాడు అన్నాడు " నువ్వు చెప్తున్నదానికి ఏమీ ఆధారం లేదు. మహాత్ముడిని కాపాడటం అనేది దుర్మార్గుడిని కాపాడటం కంటే కష్టం ఎలా అవుతుంది?" అని.

రెండవవాడు కోపంగా బదులుచ్చాడు. "ఎంత అహంకారం, నేను ఆధారం లేకుండా మాట్లాడుతున్నానని అనటానికి?! నేను కేవలం వాస్తవాన్ని ప్రవచించాను. నాకనిపిస్తున్నది, నిజానికి నువ్వే ఆధారం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావని!"

అప్పుడా దేవదూతలు ఇద్దరూ కలబడి కొట్టుకున్నారు.- మొదట పదాలతోటీ, ఆపైన పిడికిళ్లతోటీ, రెక్కలతోటిన్నీ.

వారిద్దరూ ఇలా కలబడి కొట్టుకుంటుండగా, వారి పై-అధికారి-దూత అక్కడికి వచ్చాడు. అతను వాళ్లిద్దరినీ ఆపి, " ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారు? దేనికి ఇదంతా? దేవదూతలు- అందునా రక్షకభటులు!- ఇలా నగరద్వారం దగ్గర కొట్టుకోవడం ఎంత నీచమైనదో మీకు తెలియదా? చెప్పండి! -ఇంతకీ మీ వివాదం దేని గురించి?" అని అడిగాడు.

ఇద్దరు దేవదూతలూ ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టారు మళ్ళీ. ఎవరికి వారు, తమకిచ్చిన పనే కఠినమైవదని, అందువల్ల తమకే ఎక్కువ గుర్తింపు లభించాలని- గట్టిగా వాదులాడటం ప్రారంభించారు.
పై-అధికారి-దూత తల ఊగిస్తూ ఆలోచనలో పడ్డాడు కొంతసేపు.

ఆపైన అతనన్నాడు-" స్నేహితులారా! మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ గుర్తింపుపైనా, అధిక గౌరవంపైనా అధికారం ఉన్నదో, నేను ఇప్పడే ఏమీ చెప్పలేను. కానీ, నేను అధికారిని గనకనూ, శాంతిని పరిరక్షించాలి గనకనూ, సరిగా సంరక్షించే బాధ్యత నాదే గనకనూ- నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ ఒకళ్ళు చేస్తున్న పనిని ఒకళ్లు మార్చుకోవాలి. 'అవతలి వాళ్లు చేస్తున్న పనే సులభం' అని మీరిద్దరూ వాదిస్తున్నారు కనుక, అలా 'సులభమైన పని'నే మీ ఇద్దరూ చేసేందుకు అవకాశం ఇస్తున్నాను నేను. కనుక ఇక మీరిద్దరూ మీ మీ విధుల్లో చేరి, సంతోషంగా పనిచేయ్యండి!" అని.

అలా సమస్య పరిష్కారం కాగా, దేవదూతలిద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు. కానీ ఇద్దరూ ఇంకా ఎక్కువ క్రోధంతో అధికారి దూతకేసి చూస్తూ పళ్లు కొరుక్కున్నారు. ఇద్దరూ తమ హృదయాలలో " అబ్బ! ఈ అధికారి దూతలు! రోజురోజుకూ వీళ్లు మా దేవదూతల పనిని ఇంకా ఇంకా కష్టతరం చేస్తున్నారు!" అనుకున్నారు.

కానీ అధికారి దూత అక్కడే నిలబడి తనలోతానే ఆలోచించుకుంటున్నాడు- "నిజమే! మనం నిజంగానే జాగ్రత్తగా గమనిస్తూ, మన దైవభటుల్ని బహు శ్రధ్ధగా సంరక్షించుకోవాలి!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License