Saturday, 25 July, 2009

పిచ్చివాడు

ఒక పిచ్చాసుపత్రి ముందున్న తోటలో నాకొక యువకుడు కలిశాడు. అతని ముఖం పాలిపోయి ఉన్నప్పటికీ, కళగా, ఆశ్చర్యాతిరేకంతో విప్పారి ఉన్నది.

నేను బెంచీమీద, అతని ప్రక్కన కూర్చుంటూ అడిగాడు- "నువ్వెందుకున్నావ్, ఇక్కడ?" అని.

అతడు నివ్వెరపోతున్నట్లు చూశాడు నావైపు "మీరడిగిన ప్రశ్న బాలేదు, అయినా నేను జవాబు చెప్తాను దానికి. మా నాన్న నన్ను తన ప్రతిబింబంగా తయారుచేద్దామనుకుంటాడు, మా బాబాయి కూడాతనలాగే అవ్వాలని అనుకుంటాడు-

ఇక మా అమ్మ అయితే, ప్రఖ్యాతిగాంచిన తన తండ్రిలాగా నన్ను తీర్చిదిద్దుదామనుకుంటుంది. మా అక్కేమో నావికుడైన తన భర్తే నేను అనుసరించాల్సిన పరిపూర్ణ ఉదాహరణ అనుకుంటుంది. మా అన్న మంచి వ్యాయామశీలి. నేను తనలాగా వ్యాయామకారుడవ్వాలని అతని కోరిక."

"మరి మా గురువులు కూడా అంతే- తాత్వికశాస్త్ర ఆచార్యులవారూ, సంగీతపు అయ్యవారు, తర్కశాస్త్రఆచార్యులూ- వీళ్లందరూ కూడా గట్టివాళ్లే. అందరూ ఎవరికి వాళ్లు, నేను అద్దంలో తమ ప్రతిబింబంలాగా మాత్రమే తయారవ్వాలని విశ్వసిస్తున్నారు".

"అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వెర్రితనం లేదు. ఇక్కడైతే కనీసం నేను నేనుగా ఉండొచ్చు".

అప్పుడతను అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా నా వైపుకు తిరిగి అడిగాడు: "కానీ చెప్పండి, మీరిక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని కూడా చదువులు, మంచి మంచి సలహాలిచ్చే వాళ్లు ఇక్కడికి తరుముకొని పంపించలేదు కదా?!" అని.

నేను జవాబిచ్చాను-" లేదు, లేదు! నేను సందర్శకుడిని!" అని.

"ఓహో! అయితే మీరు ఈ నాలుగ్గోడల బయటి పిచ్చాసుపత్రిలో ఉంటే జనాల్లో ఒకరన్నమాట" అన్నాడతను.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License