Friday 24 July 2009

శాంతి-యుద్ధం

మూడు కుక్కలు నీరెండలో కులాసాగా చలికాపుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి.

మొదటి కుక్క అన్నది, ఊహల్లో విహరిస్తున్నట్లు- "ఈనాటి ఈ కుక్కస్వామ్య ప్రపంచంలో బ్రతకగల్గటం చాలా అద్భుతంగా ఉంది. మనం సముద్రపు లోతుల్లో ఎంత సులభంగా ప్రయాణిస్తున్నామో చూడండి! భూమిమీద, ఆకాశంలో కూడా ఎలా విహరిస్తున్నామో చూడండి. మరి, కుక్కల సౌఖ్యం కోసం- మన కళ్లకోసం, చెవులకోసం, ముక్కులకోసం, మనవాళ్లు చేసిన ఆవిష్కరణలను, కనుగొన్న కొత్త విషయాలను ఓ మాటు తలచుకొని చూడండి! ఎన్ని అద్భుతాలు, నిజంగా!" అని.

అప్పుడు రెండవ కుక్క అన్నది-" మనం ఇప్పుడు కళల పట్ల గతంలో కంటే సున్నితంగా ఉంటున్నాం. మన పూర్వీకులతో పోలిస్తే, ఇప్పుడు మనం చంద్రుడిని చూసి మరింత లయబధ్ధంగా అరుస్తున్నాం. అంతేకాదు, మనల్ని మనం నీళ్లలో చూసుకుంటే తెలుస్తున్నది- మన ప్రస్తుత రూపాలు, నిన్నటి మన రూపాల కంటే స్పష్టంగా ఉంటున్నాయని!" అని.

అప్పుడు మూడవ కుక్క అన్నది-" కానీ అన్నింటిలోకీ నన్ను ఆశ్చర్యపరిచేదీ, నా మనసును ఉల్లాసంగా తొలిచేదీ, ఒకటుంది. వేరువేరు కుక్కస్వామ్యాల మధ్య ఈనాడు ఉన్న అవగాహన! -అది నిజంగా అద్భుతమే అనాలి."

సరిగ్గా అదే క్షణానికి, కుక్కల్ని పట్టుకునేవాడొకడు సమీపించటం చూశాయి మూడూనూ. తక్షణమే మూడు కుక్కలూ లేచి, వేటికవే రోడ్డుకు అడ్డంపడి పరుగుతీశాయి. వగరుస్తూ మూడోకుక్క అరిచింది- "ప్రాణాలతో మిగలాలంటే పరుగెత్తండి! అటూ ఇటూ చూడకండి!! నాగరికత మన వెంట పడుతోంది!!!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License