Saturday 25 July 2009

జాద్ నగరపు భూమి

జాద్ నగరానికెళ్లే మార్గంలో బాటసారి ఒకడు, అక్కడి గ్రామస్తుడిని కలిశాడు. బాటసారి చెయ్యెత్తి అక్కడున్న విశాలమైన మైదానాన్ని చూపిస్తూ అడిగాడు- "ఆలం మహారాజు శత్రువుల్ని ఓడించిన రణభూమి ఇదే కదూ?" అని.

గ్రామస్తుడన్నాడు "ఇది ఏనాడూ‌ రణ భూమి కాలేదు. ఈ మైదానంలోనే, ఒకప్పుడు, విశాలమైన జాద్ నగరం ఉండేది. తరువాత నగరం మొత్తం అగ్ని జ్వాలలకు ఆహుతైపోయింది. కానీ ఇప్పుడు ఇది చాలా మంచి చేను. దీని మట్టి చాలా బాగుంది కదూ?" అని.

ఆ తర్వాత బాటసారి ఇంకా ముందుకెళ్లాడు.

ఇంకా ఒక అరమైలు కూడా నడవలేదు, అతనికి ఇంకొక వ్యక్తి ఎదురయ్యాడు. బాటసారి చేయెత్తి ఆ మైదానాన్ని చూపుతూ- "ఇక్కడే కదా, ఒకప్పటి సువిశాల జాద్ నగరం నిలిచి ఉండింది?" అని అడిగాడు.

"ఈ స్థలంలో నగరం ఎప్పుడూ లేదు. కానీ ఇక్కడ ఒకప్పుడు గొప్ప ఆశ్రమం ఒకటి ఉండేది. దక్షిణ రాజ్యపు ప్రజలు దాన్ని ధ్వంసం చేసేశారు" అన్నాడతను.

ఇంకొంచెం దూరం పోయాక, అదే జాద్ నగరపు రోడ్డు మీద బాటసారికి మూడో వ్యక్తి ఒకడు తారసపడ్డాడు.

"ఈ భూమిలోనే కదూ, ఒక గొప్ప ఆశ్రమం ఉండింది?" అని అడిగాడతన్ని బాటసారి, మళ్లీ అదే మైదానాన్ని చేతితో చూపెడుతూ.

కానీ ఆ మనిషన్నాడు- "ఈ ప్రాంతంలో ఏనాడూ‌ఆశ్రమం లేదు. కానీ మా తాతల కాలంలో ఇక్కడ, ఈ భూమిలోనే, ఒక పెద్ద ఉల్క రాలి పడిందని చెప్తుంటారు పెద్దలు" అని.

అప్పుడా బాటసారి తనలో తానే ఆశ్చర్యపోతూ ముందుకి సాగాడు. అదే దారిలో అతనికొక ముసలివగ్గు కనిపించాడు. బాటసారి అతనికి నమస్కారం చేసి అడిగాడు "తాతగారూ, ఇదే రోడ్డు మీద, నేను ఈ ప్రాంతవాసులు ముగ్గుర్ని కలిశాను వేరువేరుగా. ముగ్గురినీ ఈ విశాల మైదానం గురించి అడిగాను. ప్రతివాడూ ఇంకొకరు చెప్పినదాన్ని కాదని, వేరే వాళ్లు చెప్పని కొత్త గాధను నాకు వినిపించారు" అని.

ముసలితాత తలెత్తి జవాబిచ్చాడు- "మిత్రమా, ఈ ముగ్గురు చెప్పినవి నిజాలే. కానీ కొందరు మాత్రమే నిజాన్ని వేరే నిజంతో కలుపుకొని ఒక సత్యాన్ని నిర్మించగల్గుతారు" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License