Friday, 24 July, 2009

రాజు

సాదిక్ రాజ్యప్రజలు రాజసౌధాన్ని చుట్టిముట్టి ఆ దేశపు రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజుగారు ఒక చేతిలో కిరీటాన్ని, మరొక చేతిలో రాజదండాన్ని పట్టుకొని, మెట్లు దిగి వచ్చి, జనవాహిని ముందు నిలబడ్డారు. ఆయనలోని హుందా తనాన్ని గమనించిన ప్రజానీకం మౌనాన్ని ఆశ్రయించింది.

రాజుగారు గొంతెత్తి పలికారు-"స్నేహితులారా, మీరిక నా చేత పరిపాలితులు కారు. నా మకుటాన్నీ, రాజదండాన్నీ మీకు అప్పగిస్తున్నాను. నేను ఇక మీలో ఒకడినౌతాను. నేను కేవలం ఒక మనిషిని. కానీ మీతో కలసి నేను మనందరి శ్రేయస్సుకోసం పాటుపడతాను. మనకు రాజు ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల మనం మన పొలాలకు, ద్రాక్షతోటలకు వెళ్లి, చేతులు కలిపి శ్రమిద్దాం. నేను ఏ పొలంలో- లేదా ఏ ద్రాక్షతోటలో- పని చెయ్యాలో మీరు చెబితే చాలు- మీరందరూ ఇప్పుడు రాజులే" అన్నారు.

ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అందరినీ నిశ్శబ్దం ఆవరించింది. ఏ రాజైతే తామందరి అసంతృప్తికీ కారకుడని తాము భావించారో, ఆ రాజే ఇప్పుడు తన మకుటాన్నీ, దండాన్నీ అప్పగించి తమలో ఒకటైనాడు.

ప్రజలందరూ తమ తమ పనుల మీద వెళ్లిపోయారు. రాజు కూడా ఒక పొలానికి వెళ్లి శ్రమించసాగాడు. కానీ సాదిక్ రాజ్యం రాజు లేకుండా ఎంతో కాలం కొనసాగలేదు. అసంతృప్తి మంచుతెరలు రాజ్యాన్ని వీడలేదు. సంతల్లోనూ, రచ్చ బండల దగ్గరా ప్రజలు గుంపులు గుంపులుగా చేరి తమకో పరిపాలకుడు ఉండాల్సిందేనని, తాము పరిపాలితులమే అవుతామని అరవటం మొదలుపెట్టారు. యువకులు,ముసలివాళ్లూ,పిన్నలూ, పెద్దలూ అందరూ ఏకకంఠంగా అరిచారు. "మనకు మన రాజు కావాలి" అని.

ఇక వాళ్లంతా రాజుకోసం వెతికి, పొలంలో శ్రమిస్తున్న రాజును కనుక్కొన్నారు. ఆయన్ని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టి, రాజదండాన్ని తిరిగి ఆయన చేతుల్లో పెట్టి, వాళ్లంతా "ఇక మమ్మల్ని మీరే పాలించాలి. న్యాయంగాను, శక్తిసమన్వితంగానూ పరిపాలన చేయండి!" అని అభ్యర్థించారు.

రాజుగారు "నేను శక్తివంచన లేకుండా మిమ్మల్ని పరిపాలిస్తాను. ఈ భూమండలాన్ని, ఆకాశాన్నీ ఏలే దేవతలందరూ నా పరిపాలన న్యాయబధ్ధంగా ఉండేలా చూసెదరుగాక!" అన్నారు.

అప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలు ఆయనకు ఒక జమీందారు గురించి చెప్పారు- "ఆ జమీందారు ప్రజల్ని హింసిస్తున్నాడు. బానిసల్లాగా చూస్తున్నాడు'అని. వెంటనే రాజుగారు అతనిని పిలిపించారు. "భగవంతుని పాలనలో అందరి జీవితాలు సమానమే! అన్నిటి బరువూ ఒక్కటే. అయితే నీకు నీ పొలాల్లోనూ, నీ ద్రాక్షతోటల్లోను కష్టించి పనిచేసేవారి జీవితాలను తూచటం రాదు. కనుక నీకిక ఈ దేశంలో ఉండే అర్హత లేదు. ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లిపో." అన్నారు.

మరుసటి దినాన పర్వతాలకు ఆవలనున్న ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు తమ ప్రాంతపు రాజ ప్రతినిధి కౄరత్వాన్ని గురించి చెప్పారు. ఆమె తమను ఎలా హింసిస్తున్నదీ వివరించారు. తక్షణమే ఆమె సభకు రప్పించబడింది. రాజుగారు ఆమెను కూడా రాజ్యం నుండి బహిష్కరించారు. "మన పొలాలు దున్ని, మన ద్రాక్ష తోటల్ని సంరక్షించే వాళ్లు- వాళ్లు తయారుచేసిన రొట్టెను తిని, వాళ్లు పిండిన ద్రాక్ష సారాయిని త్రాగి బ్రతికే మనకంటే ఉత్తములు. కానీ నీకు ఈ సంగతి తెలియలేదు. కనుక నువ్వు ఈ భూమిని విడచి, ఈ దేశానికి దూరంగా జీవించాలి" అన్నారు.

ఆ తర్వాత వచ్చిన పౌరులు ఒక మతాధికారి గురించి చెప్పారు. ఆ మతాధికారి మందిర నిర్మాణం కోసం ప్రజలందరిచేతా రాళ్ళు కొట్టించి, మోయించుతాడు. కానీవారికి ఏమీ ప్రతిఫలం ఇవ్వడు. పనివారంతా ఆకలితో మాడుతుండగా, మతాధికారి పెట్టెనిండా బంగారము, వెండి మూలుగుతున్నాయి. అయినా, అతను పనివారిని దయచూడడు.

రాజుగారు వెంటనే మతాధికారిని పిలిచారు. అతను రాగానే రాజుగారన్నారు- " నువ్వు ధరించే శిలువకు అర్థం "ప్రాణానికి ప్రాణం ఇవ్వటం." కానీ నువ్వు జీవం నుండి జీవాన్ని గ్రహించి, బదులుగా ఏమీ ఇవ్వలేదు. అందువల్ల నువ్విక ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో. ఇక తిరిగి రాకు" అని.

అలా పున్నమి నాటి వరకు అన్ని వర్గాల ప్రజలూ రాజుగారి దగ్గరికి వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు. అలాగే పున్నమి నాటి వరకు ప్రతిరోజు ఎవరో కొందరు దోపిడిదార్లు రాజ్యం నుండి బహిష్కరించబడ్డారు.

ఇక సాదిక్ రాజ్య ప్రజలు ఆశ్చర్యాతిరేకాలతో ఉప్పొంగిపోయారు. వాళ్ల హృదయాలలో సంతోషం నిండింది. ఒకనాడు పిన్నలు, పెద్దలు అందరూ వచ్చి రాజుగారి ప్రాసాదం చుట్టూ నిలబడ్డారు. రాజుగారు ఒక చేతిలో మకుటాన్ని, రెండవ చేతిలో రాజదండాన్ని పట్టుకొని మెట్లు దిగి వచ్చారు.

ఆయన వారితో అన్నారు "ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలో ఆదేశించండి. చూడండి, మీరు నాపై ఉంచిన భారాన్ని మీకు పూర్తిగా తిరిగి అప్పగిస్తున్నాను" అని.

కానీ వాళ్లంతా "వద్దు! వద్దు!! మహారాజా! మీరే మాకు సరైన పాలకులు. మీరు దుర్మార్గుల్ని తుదముట్టించారు. మేం మీకు కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాద సుమాల్ని అర్పించడానికి వచ్చాం. ఈ కిరీటం శోభాన్వితులైన తమరిదే. ఈ రాజదండం యశస్కులైన మీదే" అని ఏకకంఠంతో అరిచారు.

అప్పుడు రాజుగారు అన్నారు "లేదు. నేనుకాదు-నేనుకాదు- మీరే రాజులు! మీరు ఎప్పుడైతే నన్ను బలహీనుడని, దుష్పరిపాలకుడని అనుకున్నారో, ఆ సమయంలో నిజానికి మీరే బలహీనంగాను, స్వపరిపాలనా సామర్థ్య రహితులుగాను ఉన్నారు. మరి ఇప్పుడు దేశం బాగుపడుతున్నది- ఎందుకంటే అది మీ కోరిక పరిధిలోకి వచ్చింది. రాజు అనబడే నేను, మీ అందరి మనసులో ఉన్న ఒక భావాన్ని మాత్రమే- మీ చర్యల్లో తప్ప, వేరుగా నాకు ఎలాంటి అస్తిత్వమూ లేదు. నిజంగా చూస్తే 'పరిపాలకుడు' అంటూ ఎవరూ ఉండరు. కేవలం పరిపాలితులు ఉంటారు. వాళ్లు తమను తాము పాలించుకుంటుంటారు.
ఇలా చెప్పి రాజు తన కిరీటంతోటీ, రాజదండంతోటీ సౌధంలోకి తిరిగి ప్రవేశించాడు. పిన్నలు, పెద్దలు అందరూ సంతృప్తిగా ఎవరి దారిన వారు వెళ్లారు. ప్రతి ఒక్కరూ తమను తామే, ఒక చేతిలో మకుటాన్ని, ఒక చేతిలో దండాన్ని ధరించిన మహారాజులా భావించుకున్నారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License