Saturday 25 July 2009

వెయ్యి సంవత్సరాల క్రితం లెబనాన్ దేశపు కొండ వాలుల్లో ఇద్దరు తత్వవేత్తలు కలిసి మాట్లాడుకుంటున్నారు:

"నువ్వెక్కడికి వెళ్తున్నావు" అని ఒకరు ఇంకొకరిని అడిగారు.

"ఈ కొండల్లో ఎక్కడో యౌవనపు ఊట ఒకటి ఉన్నదని నాకు తెలిసింది. సూర్యుని వైపుగా పారే ఆ ఊటను గురించిన రచనలు కొన్ని నాకు దొరికాయి. నేను ఆ ఊటను అన్వేషిస్తున్నాను. మరి నువ్వు-? నువ్వేం వెతుకుతున్నావు?" అని అడిగాడు రెండవ వ్యక్తి. మొదటివాడు జవాబుగా చెప్పాడు- "నేను మృత్యు రహస్యాన్ని ఛేదిద్దామని చూస్తున్నాను" అని.

అప్పుడు ఆ తత్వవేత్తలిద్దరికీ ఎవరికి వాళ్లకు, ఎదుటి వాడికి తమంత శాస్త్ర పరిజ్ఞానం లేదని తోచింది. ఇద్దరూ గట్టిగా వాదించుకొని, ఎదుటివాడికి ఆధ్యాత్మిక దృష్టి లేదని తిట్టడం మొదలెట్టారు.

ఇలా ఈ ఇద్దరు తత్వవేత్తలూ బలంగా పోట్లాడుకుంటుండగా, దారిన పోయే దానయ్య ఒకడు వీళ్లిద్దరి కొట్లాటనూ చూసి, నిలబడి పోయాడు. ఆ దానయ్య తెలివికి సొంత ఊరిలో ఏమంత పేరు కూడా లేదు.
కొంతసేపు అలా విన్నాక, అతను వాళ్ల దగ్గరకు పోయి అన్నాడు- "అయ్యలారా! చూస్తుంటే మీరిద్దరూ నిజంగా ఒకే తత్వ విచార శాఖ నుంచి వచ్చినట్లు, ఇద్దరూ ఒకే దాన్ని మాట్లాడుతున్నట్లు, కేవలం వేరు వేరు పదాలను వాడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. మీలో ఒకరు యౌవనపు ఊటను, వేరొకరు మృత్యు రహస్యాన్ని అన్వేషిస్తున్నారు. కానీ నిజానికి అవి రెండూ ఒకటే, అవి రెండూ ఒకటిగా మీ ఇద్దరిలోనూ ఉన్నాయి!"అని.

అలా చెప్పి అతను వెనక్కి తిరిగి, "వెళ్లొస్తానండీ, ఋషులూ!" అని వెళ్లిపోయాడు. పోబోతూ అతనొక పొడి దగ్గుతో కూడిన నవ్వు నవ్వి మరీ వెళ్లాడు.
తత్వవేత్తలిద్దరూ ఒక క్షణకాలం పాటు నిశ్శబ్దంగా ఒకరి ముఖాన్నొకరు చూసుకున్నారు. ఆపైన ఇద్దరూ నవ్వారు కూడా. వాళ్లలో ఒకడు అన్నాడు, "సరే, మరి, మనం ఇద్దరు కలిసి వెతుకుదామా ఇక, దాన్ని?" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License