Monday, 6 July, 2009

ప్రవక్త-పిల్లవాడు

ఒకసారి, జ్ఞాని, ప్రవక్త అయిన షరియా ఒక తోటలో తిరుగుతూండగా ఆయనకు ఒక చిన్న పిల్లవాడు కనబడ్డాడు.

పిల్లవాడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి "నమస్కారమండీ"అన్నాడు.

షరియా కూడా బదులుగా "నమస్కారమండీ" అన్నాడు. అని,ఒక క్షణం ఆగి "మీరు ఒంటరిగా ఉన్నట్లుంది?" అని అన్నాడు.

పిల్లవాడి ముఖం నవ్వుతో వెలిగిపోయింది. అన్నాడు-" మా దాయిని వదిలించుకోవడానికి చాలా సమయం పట్టింది. నేను ఆ కనబడే పొదల చాటున ఉన్నానని ఆమె అనుకుంటోంది. కానీ నేను ఇక్కడున్నానని నీకు తెలుస్తోంది కదూ?" అని.

ఇలా అంటూవాడు ప్రవక్త ముఖంకేసి దీక్షగా చూసి, "నువ్వూ ఒంటరిగానే ఉన్నావు. మీ దాయిని ఏం చేశావు నువ్వు?" అని అడిగాడు ఉత్సాహంగా.

ప్రవక్త కూడా నవ్వుతూ చెప్పాడు- "ఓహ్- అది వేరే సంగతి. నిజం చెప్పాలంటే ఆమె నుండి తప్పించుకోవడం నాకసలు వీలే అవ్వటం లేదు చాలాసార్లు. కానీ ఇప్పుడు, నేను ఈ తోటలోకి వచ్చానా, ఆమె నాకోసం ఆ పొదల మాటున వెతుక్కుంటున్నది!" అని.

పిల్లవాడు సంతోషంగా చప్పట్లు కొడుతూ అన్నాడు- "ఓహో, అంటే నువ్వూ నాలాగే తప్పిపోయావన్నమాట. ఇలా తప్పించుకోవటం చాలా బాగుంటుంది కదూ?" అని. తర్వాత వాడే అడిగాడు "నువ్వెవరు?" అని.

ప్రవక్త బదులిచ్చాడు- "నన్ను షరియా ప్రవక్త అంటారందరూ. మరి, చెప్పు, నువ్వెవరు?" అని.

"నేను నేనే " అన్నాడు పిల్లవాడు- " మా దాయి నా కోసం వెతుకుతోంది,కానీ నేనెక్కడున్నదీ ఆమెకి తెలీటం లేదు."

ప్రవక్త శూన్యంలోకి చూస్తూ అన్నాడు- "నేను కూడా మా దాయినుండి కొంచెంసేపు తప్పిపోయాను; కానీ ఆమె నన్ను తప్పకుండా కనుక్కుంటుంది." అని.

పిల్లవాడన్నాడు "మా దాయి నన్ను కనుక్కుంటుందని నాకు తెలుసు".

సరిగ్గా అదే సమయానికి, పిల్లవాడిని పేరుపెట్టి పిలుస్తూ ఓ మహిళ గొంతు వినబడింది.

"చూశావా" అన్నాడు పిల్లవాడు. "నేను చెప్పలేదా, ఆమె నన్ను కనుక్కుంటుందని?"

అదే క్షణాన వేరే స్వరం ఒకటి వినబడింది- "నువ్వెక్కడున్నావు, షరియా?" అని.

ప్రవక్త అన్నాడు పిల్లవాడితో-"చూశావా,బాబూ! వాళ్లు నన్ను కూడా కనుక్కునేశారు!?" అని.

ఆ పైన ఆకాశంకేసి తలత్రిప్పి, షరియా జవాబిచ్చాడు- "ఇక్కడున్నాను నేను" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License