Saturday 25 July 2009

వంతెనల నిర్మాతలు

యాంటియోక్ లో, అప్సినది సముద్రంలో కలిసే చోట , నగరంలో ఒక సగాన్ని మిగిలిన సగంతో కలుపుతూ ఒక వంతెనను నిర్మించారు. ఆంటియోక్ లోని కంచర గాడిదలు ఎంతో శ్రమించి, కుంటల్లోని పెద్ద పెద్ద బండరాళ్లను ఆ చోటుకు తరలించుకు వచ్చాయి.

వంతెన నిర్మాణం పూర్తవ్వగానే అక్కడున్న ఒక స్తంభం మీద గ్రీకు భాషలోనూ, ఆర్మాక్ భాషలోనూ చెక్కించారు: "ఈ వంతెన మహారాజశ్రీ యాంటియోకస్-2 గారిచే నిర్మింపబడింది" అని. ప్రజలంతా చక్కని ఆ వంతెననెక్కి, చక్కని ఆ నదిని సులభంగా దాటి పోసాగారు.

ఒకనాడు సాయంత్రం "కొంచెం తిక్కవాడు" అని పేరున్న కుర్రవాడొకడు ఆ అక్షరాలను బొగ్గుతో చెరిపేసి, దాని పైన ఇలా రాశాడు: "ఈ వంతెనను నిర్మించేందుకు అవసరమైన రాళ్లను కొండలపైనుండి ఇక్కడికి కంచర గాడిదలు తీసుకు వచ్చాయి. ఈ వంతెనపై అటు-ఇటు ప్రయాణించటంలో, మీరు ఆంటియోక్ కు చెందిన ఆ కంచర గాడిదల వీపులపైన నడుస్తున్నారు. ఆ కంచర గాడిదలే ఈ వంతెన నిర్మాతలు!" అని.

దానిని చదివిన వాళ్లలో కొందరు నవ్వారు. కొందరు ఆశ్చర్యపోయారు. కొందరన్నారు- "ఓహ్! ఈ పని చేసినదెవరో మాకు తెలుసు. అతనికి కొంచెం తిక్క కదూ" అని.

కానీ ఒక కంచర గాడిద, నవ్వుతూ అన్నది, ఇంకోదానితో. "మనం నిజంగానే ఆ రాళ్లను మోసుకెళ్లాం, నీకు గుర్తుందా? అయినా ఇన్నాళ్లూ యాంటియోకస్ రాజే ఈ వంతెనను కట్టాడని అనుకున్నారు వీళ్లంతా!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License