Friday 24 July 2009

విగ్రహం

ఒకానొకప్పుడు కొండల్లోని పల్లెలో ఒక మనిషి నివసించేవాడు. అతని దగ్గర ఒక పురాతన విగ్రహం ఉండేది. అది అతని ఇంటిముందు బోర్లా పడేసి ఉండేది, దుమ్ము కొట్టుకొని. ఆ మనిషి దాన్ని అసలు పట్టించుకునేవాడు కాదు.

ఒకనాడు పట్టణం నుండి ఒక వ్యక్తి ఆ వైపుగా వచ్చాడు- కొంచెం చదువుకున్నవాడు. పల్లెవాడి ఇంటిముందు పడి ఉన్న ఈ విగ్రహాన్ని చూసి, అతను ఆ మనిషిని అడిగాడు- "దీన్ని ఏమైనా అమ్ముతావా?" అని.

పల్లెవాడు నవ్వాడు. " ఈ పనికిమాలిన రాయిని ఎవరు కొంటారంటావు?" అని అడిగాడు.

పట్నం మనిషి "నేనైతే దీనికి ఒక వెండి నాణెం ఇవ్వగలను" అన్నాడు.

పల్లెవాడు నిర్ఘాంతపోయాడు! చాలా సంతోషం వేసింది అతనికి. వెంటనే బేరం కుదిరింది. పట్నంవాళ్ళు ఆ విగ్రహాన్ని ఏనుగు అంబారీ మీద ఎక్కించి నగరానికి తీసుకువెళ్లారు.

చాలా నెలలు గడిచిన తర్వాత, పల్లెమనిషి ఏదో పనిమీద పట్టణానికి వెళ్లాడు. పట్టణ వీధుల గుండా నడుస్తుండగా అతనికొక దుకాణం ముందు పెద్ద గుంపు ఒకటి కనబడింది. అతనూ ఆ గుంపులో చేరి, దుకాణంవాడు పెద్ద గొంతుతో ఏమని అరుస్తున్నాడో విన్నాడు.

దుకాణం అతను అరుస్తున్నాడు- "రండి! రండి! చూడండి! ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన, అతి అద్భుతమైన శిల్పరాజం! అత్యున్నత శిల్పకళావేత్త అపూర్వంగా సృష్టించిన ఈ కళాఖండాన్ని చూసేందుకు మీరు చెల్లించేది కేవలం రెండు వెండిరూకలు మాత్రమే. రండి! రండి! చూసి తరించండి!" అని.

అప్పుడు పల్లెవ్యక్తి రెండు వెండినాణాలు చెల్లించి దుకాణంలోకి వెళ్లి చూశాడు. అక్కడ తను ఒక వెండి నాణానికి అమ్మేసిన శిల్పం ఉన్నది, ఉన్నతంగా నిల్చుని!

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License