Saturday 25 July 2009

నిన్న-నేడు-రేపు

నేనన్నాను మా మిత్రుడితో- "అతని భుజాన్ని పట్టుకొని వేలాడుతున్న అమ్మాయిని చూశావా? నిన్న ఆమె నా భుజాన్ని పట్టుకొని వేళ్లాడింది!" అని.

మా మిత్రుడన్నాడు "రేపు ఆమె నా భుజం మీద వాలుతుంది" అని.

నేనన్నాను-"చూడు, అతని ప్రక్కన ఎలా ఆనుకొని కూర్చున్నదో! నిన్నటికి నిన్న, ఆమె అలాగే నన్ను ఆనుకొని కూర్చున్నది!" అని.

అతను జవాబిచ్చాడు- "రేపు ఆమె నా ప్రక్కన కూర్చుంటుంది" అని.

నేనన్నాను- "ఆమె అతని గ్లాసులోంచి ద్రాక్షరసాన్ని త్రాగుతున్నది చూడు! నిన్న ఆమె నా గ్లాసులోంచి ద్రాక్షరసం తాగింది!" అని.

అతనన్నాడు- "రేపు నా గ్లాసులోంచి!" అని.

అప్పుడు నేనన్నాను- "ఆమె అతనికేసి ఎలా చూస్తున్నదో చూడు! ప్రేమ, అంగీకారం కనబడుతున్నాయి ఆ కళ్లల్లో. నిన్న ఆమె నాకేసి అలాగే చూసింది!" అని.

నా స్నేహితుడన్నాడు- "ఆమె రేపు నన్ను అలానే చూస్తుంది!" అని.

నేనన్నాను- "ఆమె అతని చెవుల్లో ప్రేమగీతాల్ని గుసగుసగా పాడటం వినబడటం లేదూ? నిన్నటికి నిన్న, ఆమె నాతో అవే ప్రేమగీతాలు ఆలపించింది!" అని.

"ఇక రేపు ఆమె నా చెవుల్లో పాడుతుంది గుసగుసగా" అన్నాడు మా మిత్రుడు.

నేనన్నాను- "ఇదిగో చూడు, ఆమె అతన్ని కౌగలించుకుంటోంది. నిన్నటికినిన్న ఆమె నన్ను కౌగలించుకున్నది!" అని.

నా స్నేహితుడు "ఆమె రేపు నన్ను కౌగలించుకుంటుంది"అన్నాడు.

నేనప్పుడన్నాను- "ఎంత వింత స్త్రీ ఈమె!" అని.

కానీ అతనన్నాడు- "ఆమె ప్రాణం లాంటిది- మగవాళ్లంతా కోరుకునేది. మరణం లాగా ఆమె అందరినీ జయించుతుంది. ఇక అనంతం మాదిరి, ఆమె మగవాళ్లనందరినీ తనలో ఇముడ్చుకుంటుంది" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License