Saturday 25 July 2009

ఒక్క దేవుడు - చాలా‌ మంది దేవుళ్లు

కిలాఫిస్ నగరపు గుడి మెట్లమీద ఒక వ్యక్తి నిలబడి ఉపన్యసించాడు- చాలామంది దేవుళ్లు ఉన్నారని. ప్రజలు తమ మనసుల్లోనే అనుకున్నారు: "మాకు తెలుసు ఇదంతా. వాళ్లు మాతో పాటే ఉంటూ మేమెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి, మమ్మల్ని అనుసరించటం లేదూ?" అని.

ఇంకా ఎంతోకాలం గడవలేదు- అంతలోనే వేరొక వ్యక్తి మార్కెట్లో నిలబడి ఉపన్యాసం ఇచ్చాడు- అతను దేవుడులేడు!" అని చెప్పాడు. అతని మాటలు విన్నవాళ్లు చాలామంది అతని అభిప్రాయాలకు సంతోషించారు- ఏమంటే- వాళ్లకు దేవతలంటే భయం, మరి!

వేరొక రోజున గొప్ప వక్త ఇంకొకడు వచ్చాడు. "ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు" అని అతను చెప్పాడు. ఇప్పుడు జనాలు దడుచుకున్నారు- ఎవరికివాళ్లు, 'చాలామంది దేవుళ్లకంటే ఒక్కదేవుడి 'అంతిమ తీర్పు' ఎక్కువ ప్రమాదకరం అనుకున్నారు.

అదే సీజన్లో ఇంకొక మనిషి కూడా వచ్చాడు. అతను జనాలతో చెప్పాడు- "మొత్తం ముగ్గురు దేవుళ్లున్నారు. వాళ్లు ముగ్గురూ ఒక్కరుగా వాయువుపై విహరిస్తుంటారు. వాళ్లకొక కరుణాంతరంగురాలైన జగన్మాత ఉన్నది. ఆమె ఏకకాలంలో వారికి చెలీ, చెల్లీ కూడా" అని.

అప్పుడు అందరి గుండెలనుంచి బరువు తీసేసినట్లయింది. వాళ్లు రహస్యంగా అనుకున్నారు. "మన తప్పిదాల గురించి ఒకరుగా ఉన్న ముగ్గురూ ఒకే అభిప్రాయం కల్గి ఉండకపోవచ్చు. అంతేకాక, వాళ్ల జగన్మాత మనలాంటి బలహీనుల తప్పుల్ని క్షమించమని ఎలాగూ మన పక్షం వహించకపోదు" అని.

అయినా ఈ నాటికీ కిలాఫిస్ నగరంలో చాలామంది దేవుళ్ల గురించీ, ఒక్క దేవుడి గురించీ, లేని దేవుడి గురించీ, ఒక్కరుగా ఉండే ముగ్గురి గురించీ, వాళ్లకున్న ఒక జగన్మాత గురించీ కీచులాడుకొని, వాదులాడుకొనే జనాలు ఎందరో ఇంకా ఉంటూనే ఉన్నారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License