Saturday 25 July 2009

చెమిటి భార్య

అనగనగా ఒక ఊళ్లో ఒక ధనికుడుండేవాడు. అతని భార్య పడుచుది, కానీ ఒట్టి చెమిటిది. ఒకనాటి ఉదయం వాళ్ళిద్దరూ టిఫిన్ చేస్తుండగా ఆమె అన్నది భర్తతో- నిన్న నేను సంతకు వెళ్ళాను కదా?

అక్కడికి రకరకాల వింత వస్తువులన్నీ అమ్మకానికి తెచ్చారు. డమాస్కస్ నుండి పట్టుబట్టలు, భారతదేశపు జేబురుమాళ్లు, పర్షియా నెక్లేసులు, యమన్ నుండి కడియాలు! మనదేశానికి ఇవన్నీ తెచ్చిన ఓడలు నిన్ననేనట, దిగింది! మరి, నన్ను చూడు, ఎలాంటి బట్టలు వేసుకున్నానో? - ఒట్టి పీలికలు! పేరుకు మాత్రమే నేనొక ధనికుడి భార్యను. ఆ వస్తువుల్లో కొన్నైనా నా దగ్గర ఉంటే తప్ప, నాకు శాంతి ఉండదు" అని.

ఆ సమయానికి ఆమె భర్త ఇంకా ఉదయపు కాఫీతో తంటాలు పడుతున్నాడు. "ప్రియతమా! నీకు మనసైన వాటిని కొనేందుకు నువ్వు ఎందుకు సంకోచిస్తున్నావో తెలీటం లేదు. అలా సంతకు పోయి, నీకు నచ్చినవన్నీ నువ్వు తెచ్చుకోరాదూ?" అన్నాడతను.

"వద్దంటున్నావా?" గుడ్లెర్ర చేసింది భార్య- "నువ్వెప్పటికీ 'వద్దు, వద్దు!' అనే అంటుంటావు. నేనెప్పుడూ ఈ పీలికల్లాంటి బట్టలు వేసుకొని ఉండాలా? నీ సంపద, పరువు, మా వాళ్ల పరువు ఏం గాను?" అని.

"అయ్యో! నేను వద్దనలేదు. నువ్వు స్వేచ్చగా‌ సంతకు పోవచ్చు. మన నగరానికి అమ్మకానికి వచ్చిన సుందరమైన వస్త్రాలనీ, ఆభరణాల్నీ నువ్వు చక్కగా‌ కొనుక్కోవచ్చు " అన్నాడు భర్త.

కానీ భార్య అతని మాటల్ని మళ్లీ తప్పుగానే అర్థం చేసుకుంది. "డబ్బులున్న వాళ్లందరిలోనూ పరమ పిసినారివి నువ్వే. నా వయసు ఆడవాళ్లంతా మంచి మంచి బట్టలు వేసుకొని టింగురంగామంటూ నగరపు తోటలో తిరుగుతుంటే, నువ్వు మాత్రం అందచందాల కోసం ఏమీ లేకుండా చేస్తావు" అని అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కన్నీళ్లు కారిపోతుండగా ఆమె రాగం తీసింది: "నేనొక్క నగో, నట్రో, బట్టో కావాలంటే చాలు, నువ్వు 'వద్దు! వద్దు!' అని రాగం మొదలెడతావు" అని.

భర్త చలించిపోయాడు. అతను లేచి నిలబడి, తన పర్సులోంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి ఆమె ముందు పెట్టి, ప్రేమపూరితమైన గొంతుతో అన్నాడు- "వెళ్లు ప్రియురాలా, సంతకు పోయి, నీకేమి కావాలో అన్నీ కొనుక్కో" అని.

ఆ రోజు నుండి చెమిటి భార్యకు ఏదైనా కావాలని బుధ్ధి పుడితే చాలు- కళ్లలో ముత్యాలు నింపుకొని భర్త ఎదు‌ట నిలబడేది. అతను మారు మాట్లాడకుండా గుప్పెడు బంగారు నాణాలు తీసి ఆమె ఒళ్లో పోసేవాడు.

ఇక ఆపైన, ఆ పడుచుది మెల్లగా ఒక కుర్రవాడిని ప్రేమించటం మొదలుపెట్టింది. ఆమె ప్రియుడికి దూరప్రాంతాలు తిరిగే అలవాటు ఉండేది. అతను అలా ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా, ఆమె లేచి కూర్చుని, ఏడ్చేది.

ఆమె అలా ఏడవటం చూసినప్పుడల్లా భర్త అనుకునేవాడు-"బహుశ: ఇంకేదో కొత్త బిడారు వచ్చి ఉండాలి. వీధిలో అమ్మకానికి ఏ పట్టుచీరలో, అరుదైన ఆభరణాలో, వచ్చి ఉండాలి" అని.

ఆ వెంటనే అతను గుప్పెడు బంగారునాణాలు తీసి, ఆమె ముందు పెట్టేవాడు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License