Saturday, 25 July, 2009

బంగారు పటకా

ఇద్దరు వ్యక్తులు ఒకానొక రోజున, స్తంభాల నగరంగా పేరుగాంచిన సలామిస్ వైపుకు వెళ్తూ, రోడ్డుమీద కలిశారు. కలిసినడుస్తూ వాళ్లిద్దరూ మధ్యాహ్నానికి ఒక పెద్ద నదిని చేరుకున్నారు. నది చాలా వెడల్పుగా ఉన్నది; దాటటానికి వంతెన ఏమీ లేదు. ఇప్పుడిక నదిని దాటాలంటే వాళ్లు ఆ నదిలోకి దిగి యీదాలి. లేకపోతే వాళ్లకు తెలీని దారి వేరే ఏదైనా ఉందేమో అన్వేషించాలి.

"మనం ఈదుదాంలే. నది ఏమంత వెడల్పుగా లేదు" అని, వాళ్లిద్దరూ నదిలోకి దూకి ఈదటం మొదలుపెట్టారు.

వాళ్లలో ఒకడికి నదులు , ప్రవాహాలు, వాటి తత్వాలు బాగా తెలుసు. అయితే నది మధ్యకు చేరుకునేసరికి అకస్మాత్తుగా అతను వశం కోల్పోయి, ప్రవాహంలో కొట్టుమిట్టాడసాగాడు. కానీ నదుల గురించి ఏమీ తెలీనివాడు సూటిగా అవతలి ఒడ్డుకు చేరుకోవటమే కాక, తన తోటివాడు నీటిలో ఉక్కిరిబిక్కిరవ్వటం చూసి , మళ్లీ నదిలోకి దూకి, అతన్ని కాపాడి,భద్రంగా ఒడ్డుకు చేర్చాడు.

తేరుకున్నాక, ప్రవాహంలో కొట్టుకుపోయిన వాడు "నీకు ఈతరాదని చెప్పావు కదూ? మరి నదిని అంత ధైర్యంగా ఎలా దాటగల్గావు?" అని అడిగాడు రెండవవాడిని.

రెండవ వ్యక్తి జవాబిచ్చాడు: "మిత్రమా, నా నడుము చుట్టూ‌ కట్టుకున్న యీ పటకాను చూశావు కదూ? నేను సంవత్సరమంతా కష్టపడి నా భార్య బిడ్డల కోసం కూడా బెట్టిన బంగారు నాణాలున్నాయి ఇందులో నిండుగా. ఆ బంగారపు బరువే నన్ను భద్రంగా నదిని దాటించింది. నేను నదిని దాటుతూన్నప్పుడు, నా యీ భుజాల మీద నా భార్యాపిల్లల్ని మోశాను!" అన్నాడు.

ఆ పైన ఇద్దరూ సలామిస్ వైపుకు నడక కొనసాగించారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License