Saturday, 25 July, 2009

కప్పలు

వేసవికాలంలో ఒకరోజున, ఒక మగ కప్ప తన స్నేహితురాలైన ఆడకప్పతో ఇలా అన్నది: "మనం రాత్రిపూట పాడే పాటల వల్ల, 'ఒడ్డున-ఆ ఇంట్లో నివసించే వారికి నిద్రాభంగం అవుతున్నదేమో' అని నాకు అనుమానంగా ఉన్నది" అన్నది.

"బాగుంది. వాళ్లు వాళ్ల మాటలతో ప్రొద్దునపూట మన నిశ్శబ్దాన్ని భంగం చేయటంలేదూ?" అన్నది ఆడకప్ప.

"రాత్రిపూట మనం ఒళ్లు మరిచిపోయి, కొంచెం ఎక్కువగానే పాడతామని మర్చిపోకూడదు మనం" అన్నది మగకప్ప.

ఆడకప్ప అన్నది- "పగటిపూటంతా వాళ్లు గట్టిగా చెవులు పగిలేలా అరుస్తూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని మర్చిపోకూడదు మనం" అని.

"మరి ఆ బోదురుకప్ప సంగతేంటి? అది తన బండ గొంతు వేసుకొని రాత్రల్లా అరుస్తూ చుట్టు ప్రక్కల ఉన్న వాళ్లందరికీ ప్రశాంతత లేకుండా చేయట్లేదూ?" అన్నది మగకప్ప.

"అవునవును. ఈ ఒడ్డుకే వచ్చి ఇక్కడి వాతావరణాన్నంతా రొదతోటీ, గందరగోళపు ధ్వనులతోటీ నింపివేస్తున్న రాజకీయ నాయకుడి గురించీ, మతాచార్యుడి గురించీ, శాస్త్రవేత్త గురించీ మాత్రం నువ్వేమీ అనవు కదూ?" అన్నది ఆడకప్ప ఈసడించుకుంటూ.

"మనం ఈ మనుషుల కంటే మంచిగా ఉందాంలే" అన్నది మగకప్ప. "మనం రాత్రి పూట శబ్దం చేయద్దు. మన పాటల్ని మన గుండెల్లోనే దాచుకుందాం- చంద్రుడు మన లయనిమ్మన్నా సరే, తారలు మన శృతిని అడిగినా సరే- కనీసం ఒకటి రెండు రాత్రులు- వీలైతే మూడు రాత్రులు- ఏ పాటనీ మన గొంతులు దాటనివ్వద్దు" అన్నదది.

"సరే, అలాగే కానియ్యి. నీ దయాపూర్ణ హృదయం ఎట్లాంటి ఫలితాలనిస్తుందో చూస్తాను, నేను కూడా" అన్నది ఆడకప్ప.

ఇక ఆ రోజు రాత్రి కప్పలు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. తర్వాతి రోజునా, ఇక మూడవరోజు రాత్రి కూడా అవి ఎలాంటి శబ్దమూ చేయలేదు.

అయితే ఆశ్చర్యం! ఆ చెరువు ప్రక్కనే ఉన్న ఇంట్లో నివసించే మాటకారి ఆవిడ, మూడోరోజు ఉదయం టిఫిన్ చేసేందుకు వచ్చి కూర్చుని, భర్త మీద అరుస్తున్నది కోపంగా- " మూడురోజులుగా నాకు రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా ఉంది. కప్పల అరుపులు నా చెవుల్లో మోగుతుంటే నేను ఇన్నాళ్లూ భద్రంగా నిద్రపోయేదాన్ని. కానీ ఏదో జరిగినట్లుంది. అవి మూడు రోజులుగా పాడటంలేదు. నాకు ఈ మూడు రోజులూ నిద్రపట్టక, పిచ్చెక్కినట్లుగా ఉంది!" అని.

వింటున్న మగకప్ప, ఆడకప్ప వైపు చూసి కన్నుగీటుతూ "మన నిశ్శబ్దం వల్ల మనకూ దాదాపు పిచ్చి పట్టినట్లే ఉంది, కదూ" అన్నది.

ఆడకప్ప బదులిచ్చింది- "అవును. రాత్రిపూట నిశ్శబ్దపు మోతని మోయటం భారంగానే ఉన్నది మనకు. నాకిప్పుడు అర్థమైంది- తమలోని ఖాళీని శబ్దంతో నింపుకోవాల్సిన వాళ్ల సౌఖ్యం కోసం మన పాటని ఆపాల్సిన అవసరం మనకు ఎంత మాత్రమూ లేదు" అని.

ఆ రోజు రాత్రి చంద్రుడు కప్పల లయను ఇమ్మన్నా, నక్షత్రాలు వాటి శృతినిమ్మని అడిగినా, ఆ కోరికలు వృదా అవ్వలేదు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License