Friday 24 July 2009

నర్తకి

బిర్కాషా రాజమందిరానికి ఒకసారి ఒక నర్తకి వచ్చింది- తన తోటి వాద్యకారులతో సహా, ప్రదర్శన ఇచ్చేందుకు. ఆమెను నాట్య ప్రదర్శనకు అనుమతించారు యువరాజుగారు. తంత్ర, జంత్ర వాయిద్యాలు- వీణ, వేణువు, మృదంగాలు సహకరిస్తుండగా ఆ నర్తకి అద్భుతంగా నాట్యం చేసింది.

జ్వాలయై ఆమె జ్వాలానృత్యం చేసింది. కత్తుల నాట్యాన్ని, బల్లాలనాట్యాన్ని చూపింది. నక్షత్రాల నాట్యాన్ని, అంతరిక్షపు నృత్యాన్ని చూపింది. గాలిలో పూలనాట్యాన్ని ప్రదర్శిస్తూన్న పువ్వైంది.

ఆ తరువాత ఆమె యువరాజు సింహాసనం ముందు నిలిచి తన శరీరాన్ని వంచి నమస్కరించింది.

యువరాజు ఆమెను దగ్గరికి పిలిచి " ఓ చక్కనిదానా! సొంపుకు, ఆనందానికీ నీవు బిడ్డవని తోస్తున్నది. నీ కళ ఎక్కడి నుండి పుడుతున్నది? నీ గానంలోనూ, నీ నర్తనపు లయలోనూ సర్వభూతాలనూ నువ్వెలా శాసించగల్గుతున్నావు?" అని అడిగాడు.

ఆమె మళ్లీ యువరాజుకు నమస్కరిస్తూ, జవాబిచ్చింది: " మహారాజా! మీరడుగుతున్న ప్రశ్నలకు జవాబులు అల్పురాలనైన నాకు తెలియదు. నాకు తెలిసింది ఇది మాత్రమే- "తత్వవేత్తల ఆత్మ వారి మెదడులలో ఉంటుంది. గాయకుల ఆత్మ వారి గళాల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ నర్తకి ఆత్మ మాత్రం ఆమె శరీరమంతటా నివసిస్తుంది" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License